బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి వామపక్షాల నేతృత్వంలోని తృతీయ కూటమికి మద్దతిస్తామని ప్రకటించింది. శుక్రవారం మాయావతి ప్రతినిధి సతీష్ మిశ్రా, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మధ్య ఈ విషయమై చర్చలు జరిగాయి. తృతీయ కూటమితోనే తమ పయనం సాగుతుందని మాయావతి సందేశం పంపినట్లు సీపీఎం వర్గాలు ఈ సమావేశం అనంతరం వెల్లడించాయి.
ఢిల్లీలో సోమవారం జరిగే తృతీయ కూటమి పార్టీల సమావేశానికి కూడా బీఎస్పీ హాజరవుతుందని మిశ్రా చెప్పారు. ఈ సమావేశంలో తృతీయ కూటమి పార్టీలు ఎన్నికల తరువాత వ్యూహాలపై చర్చలు జరపనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు శనివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. |