పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో మావోయిస్టుల ఆధీనంలోని ఓ కీలక ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని సమస్యాత్మక లాల్‌గఢ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది గత వారం రోజులుగా మావోయిస్టుల ఆధీనంలోని ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
తాజాగా మావోల ఆధీనంలోని కీలకమైన రామ్‌గఢ్‌ను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్‌మైన్లు పేల్చడం, ఎదురుకాల్పులకు దిగడం ద్వారా మావోయిస్టుల లాల్‌గఢ్‌లో భద్రతా సిబ్బందికి గట్టి ప్రతిఘటన ఇస్తున్నారు. అయినప్పటికీ విజయవంతంగా తమ ఆపరేషన్‌ను ముందుకు తీసుకెళుతున్న భద్రతా దళాలు శనివారం రామ్‌గఢ్‌పై పట్టు సాధించాయి.
ఇదిలా ఉంటే మావోయిస్టులు అధికార లెఫ్ట్ పార్టీల ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ కార్యాలయానికి నిప్పంటించారు. అనంతరం కాసేపటికి రామ్‌గఢ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. రామ్‌గఢ్‌లో పోలీసు అవుట్‌పోస్ట్, ఓ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోలీసులు ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరిస్తారన్నారు. తమ ఆపరేషన్ చివరి వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. |