చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టులు సల్వాజుడుం ఉద్యమానికి చెందిన ఓ ప్రముఖ నేతను హత్య చేశారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేక పౌర సాయుధ దళాన్ని సల్వాజుడుంగా పిలుస్తారు. ఈ దళానికి చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంది. ఈ సల్వాజుడుంకు చెందిన ఓ ప్రముఖ నేతను ఆదివారం మావోలు హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.
బీజాపూర్ జిల్లాలోని పింకొండ ప్రాంతంలో ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్పారు. సోమ్లు (40) అనే సల్వజుడుం నేతను ఆదివారం ఉదయం పదునైన ఆయుధాలతో మావోలు దాడి చేసి హత్య చేశారు. రాత్రి సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో ఉండి, తెల్లవారగానే ఇంటికి తిరిగివస్తున్న సోమ్లుపై మావోలు దాడి చేశారు. మురియా గిరిజన వర్గానికి చెందిన సోమ్లు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
వివాదాస్పద సాయుధ ఉద్యమం "సల్వాజుడుం" జూన్ 2005లో ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి నైతిక మద్దతు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మానవహక్కుల సంఘాలు మాత్రం ఉద్యమం జరుగుతున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం సల్వాజుడుం ఉద్యమకారులకు ఆయుధాలు, ఆర్థిక మద్దతు అందిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. |