దేశంలో కరువు పరిస్థితులు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు. రుతుపవనాలు ఆశాజనకంగా లేకపోవడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రుతుపవనాల జాప్యమైనప్పటికీ, దేశంలో కరువు పరిస్థితులు నెలకొని లేవని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ధరల పెరుగుతాయని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆహార ధాన్యాల సేకరణ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోగలదని, ప్రభుత్వం వద్ద కావాల్సిన స్థాయిలో ఆహార నిల్వలు ఉన్నాయన్నారు.
జులై- ఆగస్టులో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నైరుతీ రుతుపవనాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒరిస్సా దక్షిణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లతోపాటు, దేశ వాయువ్య ప్రాంతంలోనూ వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. |