దేశంలోని పలు రాష్ట్రాలలోని వివిధ పార్టీలు తమ ప్రాంతాలను రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్లు అందాయని గృహ మంత్రిత్వశాఖ తెలిపింది.
ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, బీహార్‌లో మిథిలాంచల్, కర్నాటకలో కూర్గ్, గుజరాత్‌లో సౌరాష్ట్రతోపాటు కనీసం పది కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయా ప్రాంతాలలోని వివిధ పార్టీలు, సంస్థలనుంచి కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు అందాయని హోం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్రసమితి, పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్, దాని చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలని బీజేఎమ్ గత కొంతకాలంగా కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. కాని చిన్న రాష్ట్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్న కేంద్రానికి మరిన్ని అర్జీలు అందాయి.
ఇదిలావుండగా ఇంకా పలు రాష్ట్రాలలోని వివిధ పార్టీలు, సంస్థలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించాలని కోరుకుంటుండగా ఆయా రాష్ట్రప్రభుత్వాలనుంచి తమకు ఎలాంటి సిఫారసు అందలేదని ఆ అధికారి తెలిపారు. కాగా ఇప్పటివరకు తమ మంత్రిత్వశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు. |