స్వైన్ బాధిత రాష్ట్రాల్లో కేరళ కూడా చేరింది. ఇక్కడ తాజాగా రెండు కేసులు వెలుగు చూశాయి. అలాగే, దేశ వ్యాప్తంగా మరో ఆరు కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96కు చేరుకుంది.
కొత్తగా నమోదైన ఆరు కేసుల్లో రెండు కేరళలో నమోదు కాగా, మిగిలిన కేసుల్లో ఒకటి హైదరాబాద్, గుర్గాన్, కోల్‌కతా, ముంబైలలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ న్యూఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరు కొత్త కేసుల్లో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారు.
అయితే, కేరళలో మూడో కేసు కూడా నమోదైనట్టు తిరువనంతపురంలో వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 24వ తేదీన దుబాయ్ నుంచి కోళికోడ్ విమానాశ్రయానికి వచ్చిన ఒక మహిళకు స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్థారించారు. ఆమెను కోళికోడ్‌లోని ప్రభుత్వ బీచ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
అలాగే, 53 యేళ్ళ మహిళతో పాటు.. 24 సంవత్సరాల యువకుడు బ్రిటన్ నుంచి ఈనెల 24వ తేదీన కొచ్చిన్ విమానాశ్రయానికి వచ్చారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈ లక్షణాలు ఉన్నట్టు తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరు తల్లీ కొడుకులని వైద్యులు చెప్పారు. ఈ ఏడు కేసుల్లో రెండు కేసుల రోగులు రక్త సంబంధీకులని ఆ వర్గాలు తెలిపారు. |