మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌థాక్రే సోమవారం ఉదయం కోర్టులో లొంగిపోయారు. 2008లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఆయన కళ్యాణ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. రైల్వే బోర్డు నిర్వహించిన పరీక్షకు హాజరైన ఉత్తరభారతీయులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేసిన విషయం తెల్సిందే.
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజ్‌థాక్రే స్థానిక కోర్టు ఎదుట లొంగిపోవాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. దీనిపై థాక్రే న్యాయవాది సయాజీ నంగ్రే మాట్లాడుతూ.. స్థానిక కోర్టు ఎదుట రాజ్‌థాక్రే లొంగిపోతారని, ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారని చెప్పారు.
కాగా, ఇదే కేసులో ఈనెల 16వ తేదీన హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెల్సిందే. అల్లర్ల కేసుకు సంబంధించి లొంగి పోవాల్సిందిగా స్థానిక కోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా, రాజ్‌థాక్రేకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ప్రస్తుత దశలో రాజ్‌థాక్రే వద్ద కస్టడియల్ విచారణ అవసరం లేదని జస్టీస్ రేఖా సొందుర్బాల్‌డోటా పేర్కొన్నారు. |