ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడుల పట్ల కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ, చీవాట్లు పెట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా దాడులు ఆగలేదని గుర్తు చేసింది. అలాంటపుడు ప్రయోజనమేమిటని అపెక్స్ కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
అత్యంత కీలమైన ఈ సమస్య జోలికి వెళ్ళకుండా ఉండలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రవాస భారతీయలు రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవంటూ కోర్టు పేర్కొంది. ఆస్ట్రేలియాలోని విద్యార్థులపై జరుగుతున్న దాడులపై కోర్టులో ఒక పిటీషన్ దాఖలైన విషయం తెల్సిందే. దీనిపై ఈనెల 23వ తేదీన విచారణ జరిపిన కోర్టు, ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. కేసును 29వ తేదీకి వాయిదా చేసింది.
ఆ ప్రకారం సోమవారం ఈ పిటీషన్‌పై విచరాణ జరిగింది. కోర్టు ఆదేశం మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దాడులను ఆపేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అఫిడవిట్‌లో అటార్నీ జనరల్ పేర్కొన్నారు. అయితే, ఈ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, పూర్తి వివరాలతో మరో అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. |