ఉత్తర భారతీయులపై దాడి చేసిన కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రేకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీతో పాటు.. లక్ష రూపాయల బాండ్ సమర్పించడంతో ఆయనకు కళ్యాణ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కోర్టులో లొంగిపోయిన కొన్ని గంటల్లోనే తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. గత 2008 సంవత్సరంలో రైల్వే బోర్డు నిర్వహించిన ప్రవేశ పరీక్షలను రాసేందుకు వచ్చిన ఉత్తర భారతీయ అభ్యర్థులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసుకు సంబంధించి రాజ్‌థాక్రేపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశం మేరకు ఆయన సోమవారం స్థానిక కళ్యాణి కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను వచ్చే నెల 13వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజ్‌థాక్రే దాఖలు చేసుకున్న పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అతను లేదా అతని పార్టీ కార్యకర్తలు ఎవరూ భవిష్యత్‌లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడరాదని ఆదేశించింది. ఒక వేళ హామీని ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు కోరింది. కాగా, 2008లో చెలరేగిన అల్లర్లకు పాల్పడిన వారు తమ పార్టీ కార్యకర్తలు కాదని రాజ్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. |