ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజా ధనంతో తన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం పట్ల నెల రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేగింది.
ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మాయావతి, 52.20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తన విగ్రహాలను ఆవిష్కరించారని ఢిల్లీకి చెందిన రవికాంత్ అనే న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అపెక్స్ కోర్టు మాయావతి సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వనియోగంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలావుండగా, మాయావతి తన సొంత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ దుమ్మెత్తి పోస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మాయా ఆవిష్కరించుకున్న విగ్రహాలతో పాటు, ఇతర విగ్రహాలను కూడా కూల్చి వేస్తామని హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలను ప్రతిష్టించే సంస్కృతి అనాదిగా వస్తోందని దీన్ని తాము వ్యతిరేకిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. |