బారాముల్లలో సోమవారం పోలీసులు జరిపిన కాల్పులపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా, బారాముల్లలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కర్ఫ్యూను విధించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్ల పోలీసు స్టేషన్‌లో ఒక మహిళపై స్థానిక పోలీసులు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం చెంది పోలీసులపై దాడులకు పాల్పడ్డారు.
ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసు కాల్పులు నిర్వహించారు. ఈ కాల్పుల్లో ఒక 20 సంవత్సరాల యువకుడు ప్రాణాలు కోల్పోగా, ఒక పోలీసు అధికారితో పాటు మరికొందరు పౌరులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూను విధించారు.
రోడ్లపైకి వచ్చిన వందలాదిమంది ఆందోళనకారులను తరిమికొట్టేందుకే పోలీసులు కాల్పులు జరిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు గాను కర్ఫ్యూ విధించినట్టు బారాముల్ల డిప్యూటీ కమిషనర్ లతీఫ్ యు జమాన్ దెవా వెల్లడించారు.
ప్రస్తుతం ఉద్రిక్తంగా మారిన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన తన భర్తను విడిపించమని కోరుతూ ఒక మహిళ స్టేషన్‌కు వచ్చింది. ఆ మహిళ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు ఆగ్రహంతో పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. |