బెంగళూరు, జోధ్‌పూర్ నగరాల్లో ఏర్పాటు చేసే తీవ్రవాద నిరోధక హబ్‌లలో ఆర్మీ ప్రత్యేక దళాలను ఉపయోగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం బుధవారం చెన్నైలో విలేకరులతో చెప్పారు. రెండో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) హబ్‌ను చెన్నైలో చిదంబరం ప్రారంభించారు. ముందురోజు ముంబయిలో తొలి ఎన్‌ఎస్‌జీ హబ్‌ను చిదంబరం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
రెండో ఎన్ఎస్‌జీ హబ్‌ను చెన్నైలో ప్రారంభించిన సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. దేశంలో ఎన్ఎస్‌జీలు ఏర్పాటు చేయడం పౌరుల్లో భద్రతా విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగమేనని చెప్పారు. దేశానికి తీవ్రవాద ముప్పు పెరిగిందనేందుకు ఇది సంకేతం కాదన్నారు. ఎన్ఎస్‌జీ హబ్‌లలో ఆర్మీ ప్రత్యేక దళాలను కూడా ఉపయోగిస్తున్నామని తెలిపారు.
బెంగుళూరు ఎన్ఎస్‌జీ హబ్‌లో ప్రత్యేక దళాలను ఉపయోగిస్తున్నామన్నారు. జోధ్‌పూర్‌లోనూ ఈ ప్రత్యేక దళాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గౌహతిలో సరిహద్దు భద్రతా దళంతో హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చిదంబరం విలేకరులతో చెప్పారు.
తీవ్రవాద దాడులు జరిగిన సమయాల్లో భద్రతా సిబ్బందిని సంఘటనా స్థలానికి వేగంగా తరలించేందుకు ఈ హబ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. మరిన్ని ఎన్ఎస్‌జీ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. తొలి దశలో ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా మెట్రో నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. |