ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలోని నాలుగు కంపెనీల కేంద్ర పారామిలిటరీ దళాలను బుధవారం ఉపసంహరించారు. గత ఏడాది మత ఘర్షణల కారణంగా శాంతి, భద్రతలను పరిరక్షించేందుకు కంధమాల్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించారు. కేంద్ర బలగాలను బుధవారం జిల్లా నుంచి ఉపసంహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
వివిధ దశల్లో కేంద్ర బలగాలను కంధమాల్ నుంచి ఉపసంహరించారు. తాజాగా నాలుగు కంపెనీల పారామిలిటరీ దళాలను వెనక్కు వెళ్లిపోవడంతో కంధమాల్ జిల్లాలో దళాల ఉపసంహరణ పూర్తయిందని ఒరిస్సా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరుణ్ సారంగీ తెలిపారు. కేంద్ర బలగాలు జూన్ 30 వరకు మాత్రమే కంధమాల్‌లో ఉంచాలని నిర్ణయించారు.
గడువు తీరడంతో దళాలను ఉపసంహరించారని, వారి స్థానంలో పోలీసు సిబ్బందిని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంచామని అరుణ్ వెల్లడించారు. గత ఏడాది మత ఘర్షణలు చెలరేగడంతో మొత్తం 4 వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని కంధమాల్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు.
గత ఏడాది ఆగస్టు 23న విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మానంద సరస్వతి, ఆయన అనుచరులు హత్యకు గురికావడంతో ఈ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయి. కొన్ని నెలలపాటు జరిగిన హింసాకాండలో 38 మంది పౌరులు మృతి చెందారు. అంతేకాకుండా 25 వేల మంది క్రైస్తవులు స్వగ్రామాలను విడిచి సహాయక శిబిరాలకు తరలివెళ్లారు. ఇప్పటికీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మూడు సహాయక శిబిరాల్లో 1200 మంది పౌరులు తలదాచుకుంటున్నారు. |