జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని సమస్యాత్మక బారాముల్లా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ఫ్యూ విధించిన ఈ పట్టణంలో నిరసనకారులపైకి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. పట్టణంలో గత కొన్నిరోజులుగా జరిగిన హింసాకాండలో మృతి చెందినవారి సంఖ్య బుధవారం నలుగురికి చేరింది.
ఇదిలా ఉంటే పట్టణంలోని ఓ ప్రాంతం నుంచి జమ్ము- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ సిబ్బందిని వెనక్కు పిలిపించింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిలో ఒకరిపై హత్య కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఖాన్‌పోరా వద్ద గత సాయంత్రం సీఆర్పీఎఫ్ సిబ్బందిలో ఒకరు జరిపిన కాల్లుల్లో ఫయాజ్ అహ్మద్ గోజ్రీ అనే యువకుడు మృతి చెందాడు.
హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఆర్పీఎఫ్ జవానును బారాముల్లా పోలీసులకు అప్పగించాలని అధికారిక యంత్రాంగాన్ని కోరినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. అంతేకాకుండా బారాముల్లా పట్టణంలోని సీఆర్పీఎఫ్ సిబ్బంది స్థానంలో రాష్ట్ర పోలీసులను కూడా తక్షణమే మోహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. |