దేశ పశ్చిమ తీరానికి తీవ్రవాద ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని హోం శాఖ మంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. దేశ పశ్చిమతీరానికి తీవ్రవాద ముప్పు పొంచివుందని నిఘా వర్గాలకు సంకేతాలు అందాయి. అయితే వెంటనే తీవ్రవాద దాడి జరిగే ప్రమాదమేమీ లేదని చిదంబరం తెలిపారు.
పశ్చిమతీర ప్రాంతానికి తీవ్రవాద ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఇటీవల ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా నిఘా వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మెరుగుపడిందని, సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు మార్గం సులభతరమైందని చిదంబరం తెలిపారు.
గుజరాత్, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలను నిఘా సంస్థలు తీవ్రవాద ముప్పుపై అప్రమత్తం చేశాయని హైదరాబాద్‌లో ఎన్ఎస్‌జీ హబ్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా చిదంబరం విలేకరులతో చెప్పారు. ఇదిలా ఉంటే గుజరాత్‌లోని కాండ్లా, ముంద్రా నౌకాశ్రయాలు, జామ్‌నగర్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చిదంబరం దేశ పశ్చిమ తీరానికి తీవ్రవాద ముప్పు పొంచివుందని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తీవ్రవాద లక్ష్యాల్లో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, బాబా అణు పరిశోధనా కేంద్రం, మహారాష్ట్ర, గోవాలోని ఇతర ప్రదేశాలు ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల తరువాత కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత భద్రతను పటిష్టపరిచింది. తాజాగా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమతీరంలో తీరప్రాంత పోలీసులు, నౌకాదళ సిబ్బంది గస్తీని కట్టుదిట్టం చేశారు. |