2002నాటి గోద్రా రైలు మారణహోమం కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు బుధవారం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గోద్రా అల్లర్ల కేసు నిందితులు 40 మంది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసు విచారణ ఇప్పటికే ప్రారంభమైనందున తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వీరికి బెయిల్ ఇచ్చేంచేందుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పీఆర్ పటేల్ నిరాకరించారు. భద్రతాకారణాల దృష్ట్యా గోద్రా మారణహోమం కేసు విచారణ సబర్మతీ జైలు ప్రాంగణంలో జరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను ఈ జైలులోనే ఉంచారు.
బెయిల్ పిటిషన్‌లపై విచారణ సందర్భంగా.. గోద్రా రైలు దహనం ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని, అయోధ్య నుంచి వస్తున్న సబర్మతీ రైలులోని ఎస్-6 బోగీని దహనం చేసేందుకు నిందితులు 140 లీటర్ల ఇంధనాన్ని ఉపయోగించారని ప్రభుత్వ న్యాయవాది ఎన్ఎన్ ప్రజాపతి కోర్టులో వాదన వినిపించారు.
ఫిబ్రవరి 27, 2002న గోద్రా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ దారణమైన దుశ్చర్యలో 59 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది కరసేవకులు ఉన్నారు.
ఈ ఘటన అనూహ్యం జరిగిన మత హింసాకాండ కాదని, ఒక వర్గంపై మరో వర్గం ముందుస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన దుశ్చర్య అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నిందుతుల్లో కొందరి తరపున వాదిస్తున్న న్యాయవాది నిందితులకు గోద్రా మారణహోమంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందనేందుకు ఎటువంటి ప్రత్యేక్ష ఆధారాలు లేవని వాదించారు. |