స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత సబబేనని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కాన్ని భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 నేరంగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సెక్షన్‌పై కొంతకాలం నుంచి స్వలింగ సంపర్కాన్ని సమర్థిస్తున్న వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది.
దీనిపై దుమారం చెలరేగుతుండటంతో ఈ చట్టం రద్దుకు కేంద్రం కూడా సానుకూల వైఖరితోనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, మరో న్యాయమూర్తి ఎస్ మురళీధర్‌తో కూడిన ధర్మాసనం స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధత కల్పిస్తూ సంచలన తీర్పు వెలువర్చింది. స్వలింగ సంపర్కుల "రైట్ టు ఈక్వాలిటీ"ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.
తాజా తీర్పుపై గేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు చాలాకాలంగా హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే రాజ్యంగంలోని ఐపీసీ 377వ సెక్షన్ స్వలింగ సంపర్కాన్ని అసహజ శృంగార చర్యగా పేర్కొంటూ, దీనికి గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించే అవకాశం కల్పించింది. దేశంలో స్వలింగ సంపర్కం రాజ్యాంగం ప్రకారం నిషిద్ధం. |