ఎగువ అసోం జిల్లాలను బ్రహ్మపుత్రా నది వరదలు వణికిస్తున్నాయి. లఖీంపూర్ జిల్లాలో అధికారిక యంత్రాంగం రెడ్అలర్ట్ ప్రకటించింది. బ్రహ్మపుత్రా నది పొంగిపొర్లుతుండటంతో నీరు నిల్వచేసేందుకు ఏర్పాటు చేసిన పెద్దకట్ట తెగిపోయింది. అంతేకాకుండా అనేక గ్రామాలు జలమయ్యాయి.
అధికారిక వర్గాలు గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మాట్మోరా వద్ద వందమీటర్ల పొడవుతో రూ.140 కోట్ల వ్యయంతో నిర్మించిన పెద్దకట్ట బ్రహ్మపుత్రా నది వరదలో బుధవారం కొట్టుకుపోయింది. దీనిని జియో- ఫాబ్రిక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏర్పాటు చేశారు. దీంతో వరద నీరు 300 గ్రామాలను ముంచెత్తింది. పలు పంచాయితీలు నీట మునిగాయి.
మొత్తం 14 వేల మంది పౌరులు వరద బాధితులుగా మిగిలారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో బ్రహ్మపుత్రాలో వరద నీరు పోటెత్తిందని అధికారులు తెలిపారు. లఖీంపూర్ జిల్లా యంత్రాంగం రెడ్అలర్ట్ ప్రకటించింది. బ్రహ్మపుత్రా నదిలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. సహాయక కార్యక్రమాల కోసం బీఎస్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. |