పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు షైనీ అహుజా జ్యూడీషియల్ కస్టడీని జులై 16 వరకు పొడిగించారు. అంథేరీ కోర్టు రేప్ కేసుపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు వీలుగా అహుజా జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు వెల్లడైన డీఎన్ఏ నివేదిక కూడా పనిమనిషిపై షైనీ అహుజా అత్యాచారానికి పాల్పడ్డాడని ధృవీకరించిన సంగతి తెలిసిందే. వైద్యపరీక్షల నివేదికలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. అత్యాచారానికి పాల్పడిన సమయంలో షైనీ అహుజా మద్యం లేదా డ్రగ్స్ మత్తులో లేడని వైద్య పరీక్షల నివేదికలు పేర్కొన్నాయి.
అహుజా కుడిచేతిలో గాటు ఉందని, మిగిలిన శరీరంపై ఎక్కడా ఎటువంటి గాయాలు లేవని ఇవి తెలిపాయి.
పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షైనీ అహుజాపై ముంబయి పోలీసుల భారత శిక్షాస్మృతిలోని 376వ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పనిమనిషిపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడవడంతో షైనీ అహుజాను జూన్ 15న పోలీసులు అరెస్టు చేశారు. |