కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తాజా బడ్జెట్‌లో మమత ప్రయాణికులపై వడ్డింపుల జోలికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. రైల్వేస్టేషన్లలో సరఫరా చేసే జనతా భోజనాల సంఖ్యను 30 వేల నుంచి లక్షకు పెంచనున్నారు. తాజా బడ్జెట్ ప్రజాకర్షకణను చూరగొంటుందని, ఇది ప్రజల బడ్జెట్ అని మమతా బెనర్జీ చెప్పారు.
ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగత్మకంగా అమలు అవుతున్న ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే చర్యలు తాజా బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఎకనామిక్ మీల్స్ (జనతా భోజనం) పేరుతో రూ.10కే అందిస్తున్న భోజన పథకానికి ప్రయాణికుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. గిరాకీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం 30 వేల భోజనాలనే సరఫరా చేస్తున్నారు.
రాబోయే నెలల్లో దీనిని రోజుకు లక్షవరకు పెంచాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే భారతీయ రైల్వేలో ప్రైవేట్ సంస్థలు అడుగుపెట్టే రోజులు కూడా దగ్గర్లోనే కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆ శాఖ మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల్లో పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి.
2008-09 ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్ల గురించి ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. రైల్వేల్లో అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకొచ్చేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. |