దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం కేరళ రాష్ట్రంలో నమోదయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ దేశంలో ప్రమాదకర స్థాయిలో లేదని, మిగిలిన దేశాలతో పోలిస్తే, ఇక్కడ స్వైన్ ఫ్లూ తీవ్రత అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే నానాటికీ దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
తకాజాగా కేరళలలో ఓ అనుమానిత స్వైన్ ఫ్లూ మరణం సంభవించినట్లు తెలుస్తోంది. స్వైన్ ఫ్లూ వ్యాధి చికిత్స పొందుతున్న 51 ఏళ్ల ఎన్నారై ఒకరు తిరువనంతపురంలోని స్టాన్‌లే పెలీస్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇతను కేరళ రాష్ట్రంలోని కొల్లం వాసి. ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే ఆయన మృతి చెందారు.
మృతి చెందిన వ్యక్తిని జాన్‌గా గుర్తించారు. జాన్ బ్రిటన్ నుంచి భారత్ వచ్చారు. ఇదిలా ఉంటే ఆయన మృతికి స్వైన్ ఫ్లూ కారణమని అధికారిక వర్గాలు ధృవీకరించలేదు. మరోవైపు దేశంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య తాజాగా 116కు చేరుకుంది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, ఇతర నగరాలకు చేరుకుంటున్న అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే అధికారిక యంత్రాంగం బయటకు పంపుతుంది.
స్వైన్ ఫ్లూ వ్యాధి అనుమానితులను ఆయా నగరాల్లోని అంటువ్యాధుల ఆస్పత్రులకు తరలించి తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్‌తో తొలి స్వైన్ ఫ్లూ కేసు మే- 16న హైదరాబాద్‌లో వెలుగుచూసింది. అనంతరం కేసుల సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70 వేల మందికిపైగా స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. |