ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలో గత ఏడాది చెలరేగిన అల్లర్లకు మతమార్పిడిలే ప్రధాన కారణమని ఆనాటి హింసాకాండపై దర్యాప్తు జరుపుతున్న ఓ న్యాయ విచారణ కమిషన్ వెల్లడించింది. కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలు ప్రధాన కారణమయ్యాయని ఈ కమిషన్ పేర్కొంది.
భూవివాదాలు, మత మార్పిడిలు, నకిలీ సర్టిఫికేట్ వివాదాలు హింసాకాండకు మూలాలని న్యాయమూర్తి ఎస్‌సీ మహోపాత్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు 23న ఓ మతపెద్ద, ఆయన అనుచరుల హత్యల అనంతరం కంధమాల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా కంధమాల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర మత ఘర్షణలు జరిగాయి. ఈ హింసాకాండలో 43 మంది పౌరులు మృతి చెందారు. అంతేకాకుండా అనేక ఇళ్లు, చర్చిలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా సమర్పించిన మధ్యంతర నివేదికలో మహోపాత్ర మతమార్పిడిల గురించి కూలంకుషంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. |