స్వలింగ సంపర్కమనేది ఓ రకమైన మానసిక రుగ్మత అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. మానసికమైన రుగ్మతతో బాధపడుతున్నవారు ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి చట్టాలను రూపొందించేకన్నా వారికి తగిన పునరావాసం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కులకు చట్టబద్ధత సరైనదేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో రాందేవ్ బాబా ఇలా స్పందించారు.... ఇలాంటివారికోసం చట్టబద్ధత కల్పించేకన్నా పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి వారికి తగిన శిక్షణ ఇస్తే వారు మారతారని అన్నారు. ఇలాంటి వారికి సాధారణమైన జీవితానికి అలవాటు పడేలా తాను తర్ఫీదును ఇస్తానని ఆయన అన్నారు. దీంతో వారు సంఘంలో మనుషులుగా బ్రతకగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ మన తల్లిదండ్రులు కూడా స్వలింగ సంపర్కులైతే మనం పుట్టేవారమా అని ఆయన ప్రశ్నించారు. ఇలాటి జబ్బున్నవారు మానసికపరమైన బలహీనతలతో బాధపడుతుంటారని, ఇది సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేదిగా ఉందని, దీనికి చట్టబద్ధత కల్పిస్తే సమాజం పాడైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతీయ జీవనసరళిని ఉదాహరణగా తీసుకుంటున్నారని, కాని మనం పాశ్చాత్య దేశాల మోజులో పడి మన సంస్కృతిని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. |