దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు నాలుగు నెలల క్రితం ఫిబ్రవరిలో అప్పటి రైల్వేశాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో అన్నీ తప్పుల తడకగా ఉన్నాయని ప్రస్తుత రైల్వేశాఖామంత్రి మంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో ప్రాజెక్టుల నిధులను రూ. 4,800 కోట్లకే కుదించారు. నిరుడు ఆర్థిక సంవత్సరంలో రైల్వేల సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో దీనిని ప్రవేశపెడుతున్నాని ఆమె పేర్కొన్నారు. గతంలో 85 కోట్ల టన్నుల లక్ష్యంగా ఉన్న సరుకుల రవాణాను 1కోటి 70 లక్షల టన్నులకు పెంచామని, రైల్వేల మిగులు భూములను వ్యాపార అవసరాల కోసం వినియోగించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచనకూడా వాస్తవదూరమేనని మమతా బెనర్జీ అన్నారు. ఈ అంశాలే తనను తాత్కాలిక బడ్జెట్ సమీక్షకు పురికొల్పాయని చెప్పారు. ఈ సమీక్షలో తాత్కాలిక బడ్జెట్‌లో వాస్తవదూపమైన భారీ లక్ష్యాలను ఏర్పరచుకున్న విషయం అవగతమైందని వివరించారు. అందువల్లే సరైన దిశలో మార్పులు జరిగాయని మమత తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. తాత్కాలిక బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా భారత రైల్వేల నికర ఆదాయం రూ. 10,876.48 కోట్లు లేదని, రూ. 8,121.48 కోట్లకు తగ్గిందని ఆమె చెప్పారు. నిర్మాణ రంగం, ఎగుమతులపై మాంద్యం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆచరణసాధ్యమైన లక్ష్యాలనే తీసుకున్నామని మమతా బెనర్జీ తెలిపారు. |