పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శనివారం రైలు ప్రమాదం సంభవించింది. హౌరా బ్రిడ్జి రైల్వే ట్రాక్ వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడగా, మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉన్నట్టు స్థానికులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారినందరినీ రక్షించి, సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. స్థానిక అధికార వర్గాల సమాచారం మేరకు.. ఈ ప్రమాదం సాయంత్రం నాలుగు గంటలకు జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు మినీ బస్సు డ్రైవర్ ప్రయత్నించగా, ఆ సమయంలో బస్సు అదుపుతప్పి రైల్వే స్టేషన్‌లోని 12వ ఫ్లాట్‌ఫాంపై బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
బస్సు మంచి వేగంతో వస్తున్నది. మరో వాహనాన్ని క్రాస్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని మరో సాక్షి వివరించాడు. పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సమీర్ గోస్వామి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారో ఖచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రమాదం వల్ల రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
ఇదిలావుండగా, పశ్చిమ రైల్వేకు హౌరా స్టేషన్ అతి ముఖ్యమైన స్టేషన్. రైల్వే ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా 10 నుంచి 23వ ఫ్లాట్‌పామ్‌లలో హైటెన్షన్ విద్యుత్ తీగల్లో విద్యుత్ ప్రసారాన్ని రైల్వే అధికారులు నిలిపి వేశారు. |