ఆర్థూర్ రోడ్ జైలులో కారాగారవాసం గడుపుతున్న పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్ ముంబై దాడుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి తాజాగా మరో విజ్ఞప్తి చేశాడు. జైల్లో ఒంటరిగా ఉండటం వల్ల బోర్ కొడుతోందని, అందువల్ల చదువుకునేందుకు పుస్తకాలు సమకూర్చాలని కోరాడు. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు జడ్జీ ఎంఎల్.తహలియానికి చెప్పినట్టు కసబ్ తరపు న్యాయవాది బుధవారం వెల్లడించారు.
ఒంటరిగా జైలు జీవితం గడుపుతున్న కసబ్‌కు బోరు కొడుతోందని, అందువల్ల చదువుకునేందుకు పుస్తకాలు అందజేయాలని జడ్జీని కోరుతున్నాడని చెప్పారు. పుస్తకాలను కోర్టు సమకూర్చడం లేదా అతని డబ్బులతో కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడని చెప్పారు. కసబ్‌ను అరెస్టు చేసినపుడు పోలీసులు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఆర్థూర్ రోడ్‌లోని అండాకార జైలులో అత్యంత కట్టుదిట్టమైన నాలుగంచెల భద్రత నడుమ కసబ్ జైలు జీవితం గడుపుతున్నాడు. గతంలో తన న్యాయవాదితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కసబ్ కోర్టును కోరాడు. ఆ ప్రకారం కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా పుస్తకాలు సమకూర్చాలని కోరుతున్నాడు.
ముంబై దాడుల కేసు కోసం జైలులోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కోర్టులో విచారణ నిమిత్తం కసబ్‌ను హాజరుపరిచారు. అపుడు.. తన లాయర్ ద్వారా విషయాన్ని తొలుత చెప్పించారు. ఆ తర్వాత తానే లేచి, ప్లీజ్.. నాకు చదువుకునేందుకు పుస్తకాలు సమకూర్చండి. లేదా నా డబ్బులతోనైనా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వండి అంటూ హిందీలో జడ్జీకి విజ్ఞప్తి చేశాడు.
అయితే, కసబ్ సొమ్ముతో పుస్తకాలు కొనుగోలు చేయడం అసాధ్యమని కోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు ప్రస్తుతం కోర్టు ఆస్తిగా పరిగణిస్తున్నారు. కాగా, కసబ్ నుంచి 4580 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. |