దేశంలోని పలు రాష్ట్రాల్లో మనుషుల అక్రమ రవాణా నిరోధక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ఖచ్చితమైన చర్యలు తీసుకునేందుకు జాతీయ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు హోంశాఖ మంత్రి చిదంబరం రాజ్యసభలో వెల్లడించారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న మనుషుల అక్రమ రవాణాను నిరోధించాలంటే ప్రత్యేక చర్యలు తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు. మనుషుల అక్రమ రవాణా నిరోధక నియంత్రణ చట్టం 1956ను సవరించేందుకు ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలను పెట్టిందని ఈ సందర్భంగా ఆయన సభకు వివరించారు. 1956 లో రూపొందించిన ఈ చట్టాన్ని సవరిస్తే అక్రమ రవాణాదారులకు ఖచ్చితమైన శిక్ష విధించే అవకాశముంటుందని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా తమకు సూచించిందని చెప్పారు. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి ఇతర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కోసం నోడల్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి చిదంబరం తెలిపారు. దేశంలో ముఖ్యంగా మహిళలు, శిశువుల అక్రమ రవాణాకు సంబంధించి 2007లో 3568 కేసులు నమోదయ్యాయి. దీనివలన ఈ మనుషుల అక్రమ రవాణా వెనుక ఉన్న సామాజిక పరిస్థితుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని చిదంబరం సూచించారు. అయితే ఈ అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రభుత్వం ఏవిధమైన ప్రణాళికలను రూపొదించిందో తెలపాలని సీపీఎంకు చెందిన బృందా కారత్ ప్రశ్నించారు. ఆమె ప్రశ్నకు చిదంబరం సమాధానమిస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ పలు చట్ట సవరణలను ప్రతిపాదించిందని చెప్పారు. పెళ్లి పేరుతో మహిళల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్నట్లు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. పెళ్లి పేరుతో జరిగే తంతులో మహిళల జీవితాలు ముడిపడి ఉన్నందున వీటిలో ఏది సక్రమమో, అక్రమమో తేల్చడం కష్టసాధ్యమని ఆయన వివరించారు. మహిళల, శిశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రాంతీయ టాస్క్‌ఫోర్స్ ఖచ్చితమైన చర్యలను అమలు చేస్తుందని తెలిపారు. |