స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ఒక జ్యోతిష్యుడు దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఈనెల 20వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. స్వలింగ సంపర్కంపై ఈ నెల 20వ తేదీలోగా వైఖరిని తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, నాజ్ అనే స్వచ్ఛంద సంస్థకు కూడా నోటీసులు పంపాలని ఆదేశించింది. కాగా, ఈ పిటీషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ప్రధమ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. లోగడ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే విషయాన్ని ఇరు వర్గాల మధ్య విచారణ జరిపిన తర్వాతే పరిశీలిస్తామని చీఫ్ జస్టీస్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్వలింగ సంపర్కానికి అనుమతి ఇవ్వడమా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వ కోర్టులోఉంది. "గే" సంస్కృతికి ప్రభుత్వం సమ్మతం తెలిపిన పక్షంలో సుప్రీం కోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించే అవకాశాలు లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈనెల రెండో తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఢిల్లీకి చెందిన సురేష్ కుమార్ కౌషాల్ అనే జ్యోతిష్యుడు సుప్రీంను ఆశ్రయించారు. |