స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలో మెల్లగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీకి చెందిన జ్యోతిష్యుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ కోవలోనే ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. గే సెక్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో శుక్రవారం పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
దీనిపై బాబా తరపు న్యాయవాదులు సురేష్ శర్మా, గంధర్వ మక్కర్‌లు మాట్లాడుతూ.. బుధవారమే సుప్రీంలో పిటీషన్ దాఖలు చేయాల్సి వుంది. అయితే అనివార్య కారణాల వల్ల ఇది ఆలస్యమైందన్నారు. ఈనెల రెండో తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులు పిటీషన్ దాఖలు చేయనున్నట్టు చెప్పారు. స్వలింగ సంపర్కం మానవ సమాజానికే కాకుండా ప్రజారోగ్యం, ఆరోగ్యకరమైన పరిణామాలతో పాటు సమాజ శ్రేయస్సు దృష్ట్యా పూర్తి విరుద్ధమన్నారు.
ముఖ్యంగా, అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో గే సెక్స్ ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని, ముఖ్యంగా దీనివల్ల హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల సంఖ్య ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ హైకోర్టు తీర్పును కేంద్రం, సుప్రీం కోర్టులు సమర్థించిన పక్షంలో దేశ రాజ్యాంగం మేరకు సంప్రదాయబద్ధంగా చేసుకునే వివాహాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు విఘాతం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. |