తన హయాంలో రైల్వే శాఖ పనితీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం డిమాండ్ చేశారు. అలాగే రైల్వే ఉద్యోగులకు డివిడెండ్ చెల్లించడంలో ప్రస్తుత మంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. లాలూ ప్రసాద్ హయాంలో తప్పుడు లెక్కలు చూపించారంటూ ఇటీవల లోక్‌సభలో రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెల్సిందే. దీనిపై లాలూ శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. తన హయాంలో అంకెల గారడీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తన పనితీరుపై మమతా బెనర్జీ శేత్రపత్రం తీసుకువస్తానని ఇచ్చిన హామీపై ఏ మాత్రం ఆందోళన లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే నేను కూడా కోరుకుంటున్నానని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ శ్వేతపత్రం సభ ముందుకు వచ్చే సరికి లెక్కలు సరిగ్గానే ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రిగా తనకు తాను ఎటువంటి లెక్కలు చేయలేదు. దానిగురించి ఎటువంటి గందరగోళం ఉండరాదన్నారు. అంతేకాకుండా.. కోసి నది వరదల కారణంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. |