ప్రొఫెసర్ హెచ్ఎస్ సభర్వాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం ఆరుగురు ఏబీవీపీ కార్యకర్తలను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2006లో ఉజ్జయినీలో జరిగిన సభర్వాల్ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయనను ఏబీవీపీ కార్యకర్తలు కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
సభర్వాల్ హత్య కేసులో పోలీసులు ఆరుగురు ఏబీవీపీ కార్యకర్తలపై అభియోగాలు నమోదు చేశారు. ఈ హత్య కేసుపై విచారణ జరిపిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు తాజా తీర్పులో ఆరుగురు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలను నిర్దోషులుగా విడిచిపెట్టింది. సభర్వాల్ హత్య కేసులో ఏబీవీపీ (బీజేపీ విద్యార్థి విభాగం)కి చెందిన కార్యకర్తలకు ప్రమేయం ఉందని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేకపోయింది.
ఉజ్జయినీలోని మాధవ్ కళాశాలలో రాజీకయ శాస్త్ర విభాగాధిపతిగా ఉన్న ప్రొఫెసర్ సభర్వాల్‌ను 2006, ఆగస్టు 26న హత్య చేయబడ్డారు. కళాశాల విద్యార్థులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన ప్రాణాలు కోల్పోయారు. కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరాన్ని వివరిస్తుండగా సభర్వాల్‌పై దాడి జరిగింది.
గత ఏడాది మార్చిలో సభర్వాల్ హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఉజ్జయినీ నుంచి నాగ్‌పూర్‌కు బదిలీ చేసింది. సభర్వాల్ కుమారుడు మధ్యప్రదేశ్ వెలుపల తన తండ్రి హత్య కేసుపై విచారణ జరపాలని కోరడంతో సుప్రీంకోర్టు కేసు విచారణను నాగ్‌పూర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా నాగ్‌పూర్ కోర్టు.. ప్రధాన నిందితులుగా పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు ఏబీవీపీ కార్యకర్తలను నిర్దోషులుగా విడిచిపెట్టింది. హత్య కేసులో వారి ప్రమేయాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు ప్రవేశపెట్టకపోవడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. |