బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనకు సంబంధించిన కేసులో కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫైళ్ళ మాయంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కోర్టు బుధవారం ఆదేశించింది. బాబ్రీ మసీదు-రామ్‌జన్మభూమి కేసుకు సంబంధించిన 23 ఫైళ్లు మాయమైనట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై జస్టీస్ సయీద్ రఫాత్ ఆలమ్, సుధీర్ అగర్వార్, డి.బి.శర్మా నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఫైళ్లు మాయమైన వ్యవహారంపై వచ్చే నెల 23వ తేదీలోగా మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించాలని సీబీఐను ఆదేశించింది. అలాగే, రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కోరింది.
ఫైళ్ల మాయమైన వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. ఇదిలావుండగా, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది, ఫైళ్ళపై ఆరా తీసింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు అయోధ్య పేరుతో ఐపీసీ 409 సెక్షన్ కింద ఒక కేసును నమోదు చేశారు. అయితే, ఎఫ్ఐఆర్‌లో ఎవరి పేరును ప్రస్తావించలేదు. |