ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఎస్పీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ శుక్రవారం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని దుయ్యబట్టారు. బీఎస్పీ సంబంధిత విగ్రహాలు, స్మారకచిహ్నాలు ఏర్పాటుకే వందలాది కోట్ల రూపాయాలు వృధా చేస్తోందని విమర్శించారు.
అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ధనాన్ని మాయావతి ప్రభుత్వం వృధా చేస్తోందన్నారు. విగ్రహాలు, ఏనుగులు (బీఎస్పీ గుర్తు) పెట్టుకునేందుకే కాకుండా, అభివృద్ధికి, విద్యుదీకరణకు కూడా చోటు ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్, ప్రస్తుత అధినేత్రి మాయావతి విగ్రహాలు పెడుతుండటంపై రాహుల్ పరోక్షంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో విగ్రహాల ఏర్పాటుపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. యూపీలోని అమేథీ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ ఈ విమర్శలు గుప్పించారు. |