స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందిన రీడా షేక్ (14) కుటుంబసభ్యులు తమ బిడ్డ మరణానికి కారణమైన రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై పోలీసు కేసు పెట్టారు. పూణేలోని సెయింట్ అన్నెస్ పాఠశాలలో తొమ్మిదో చదువుతున్న రీడా షేక్ మంగళవారం స్వైన్ ఫ్లూ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ బాలిక మృతికి ఆమెకు చికిత్స అందించిన రెండు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్య వైఖరే కారణమని తేలింది.
దీంతో ఈ రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రీడా కుటుంబం ఉపక్రమించింది. దేశంలో స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందిన తొలి వ్యక్తి రీడా షేక్ కావడం గమనార్హం. తాజాగా రీడా కుటుంబసభ్యులు ఆమెకు చికిత్స అందించిన జహంగీర్ ఆస్పత్రి, రూబీ హాల్ క్లినిక్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రెండు ఆస్పత్రులపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని వారి తరపు న్యాయవాది ఆసిఫ్ లాంప్వాలా తెలిపారు.