ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో 30 మంది చనిపోయారు. మరో 50 మంది శకలాల కింద సజీవ సమాధి అయి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న లా, గెర్నా, లెలూ నెహర్ గ్రామాలు ఆనవాలు లేకుండా పోయాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు 450 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామాలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా, కొండ చరియలు విరిగి పడడం వల్ల కొండ కింద గ్రామాలకు చెందిన ప్రజల్లో 30 మంది మృత్యువాత పడినట్టు అధికారులు తెలిపారు. మరో 50 మంది ఆచూకీ తెలియలేదు. ఇండో టిబెటిన్ పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.