దేశ రాజధాని నేరాలు.. ఘోరాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. మహిళలు ఎక్కువగా చిత్రహింసలు, అత్యాచారలకు గురవుతున్న ప్రాంతంగా ఢిల్లీ ఇప్పటికే రికార్డు పుటలకెక్కింది. తాజాగా మరో యువతి అత్యాచారానికి గురైంది. ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తున్న ఉద్యోగినికి సహ ఉద్యోగే మత్తు మందు ఇచ్చి.. ఆపై అత్యాచారం చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే ఉత్తరాఖండ్‌కు చెందిన 27 సంవత్సరాల యువతి ఢిల్లీలోని ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తోంది. ఆమెతో పాటు.. పని చేసే సహ ఉద్యోగి.. ఆమెపై కన్నేశాడు. తన కోర్కెను తీర్చుకునేందుకు మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని ఆఫర్ చేశాడు. సహ ఉద్యోగి కావడంతో ఆ యువతి కూల్‌డ్రింక్స్‌ను సేవించిన కొద్ది సేపటికి అపస్మారక స్థితిలోకి జారుకుంది.
ఆ తర్వాత కాల్ సెంటర్ క్యాబ్‌లోనే అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఢిల్లీలోని పశ్చియం విహార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన సహ ఉద్యోగి 28 సంవత్సరాల ప్రశాంత్ రాణాను బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి ఆమె నివాసానికి సమీపంలో ఉన్న జ్వాలా హెది మార్కెట్ సమీపంలో చేసుకోగా, సోమవారం వెలుగులోకి వచ్చింది.
కాగా, ఉత్తరాఖండ్‌కు చెందిన యువతి అద్దె నివాసంలో ఉంటూ ఉద్యోగం చేస్తుండగా, నిందితుడు రాణా బుధ్ విహార్ సమీపంలో నివశిస్తున్నాడు. దీనిపై వెస్ట్ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. బాధితురాలు శనివారం తమను సంప్రదించింది, తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసిందని చెప్పారు.
ఆ తర్వాత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు కూడా అత్యాచారం జరిగినట్టు ధృవీకరించారని అగర్వాల్ వెల్లడించారు. అయితే, తనను తీసుకెళ్లిన స్థలం, అత్యాచారం చేసిన ప్రాంతాలు గుర్తులేవని బాధితురాలు చెప్పిందని తెలిపారు. దీనిపై రాణాను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్టు కమిషనర్ వెల్లడించారు.