హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఐదు నెలల క్రితం హిమాచల్‌లో ర్యాగింగ్ కారణంగా ఓ కళాశాల విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. ర్యాగింగ్ కారణంగా విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తదనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్‌ను నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. తాజాగా హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ర్యాగింగ్‌ను నిరోధించేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద ర్యాగింగ్‌కు పాల్పడినవారికి మూడేళ్లవరకు జైలుశిక్ష విధించే అవకాశం కల్పించడంతోపాటు, రూ.50 వేల వరకు జరిమానా విధించవచ్చు.
ఆగస్టు 12న రాష్ట్ర అసెంబ్లీ హిమాచల్‌ప్రదేశ్ విద్యా సంస్థల (ర్యాగింగ్ నిరోధక) బిల్లు, 2009ను మూజువాణీ ఓటు ద్వారా ఆమోదించింది. కొత్త చట్టాన్ని ఈ ఏడాది మార్చి 25 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మార్చి 8న రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలో ఉన్న రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తొలి ఏడాది విద్యార్థి అమర్ కచ్రూ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కచ్రూ మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ సమయంలో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ర్యాగింగ్ నిరోధక ఆర్డినెన్స్ స్థానంలో కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చారు.