భారతీయ జనతా పార్టీ నుంచి తప్పుకున్న అగ్రనేత ఎల్కే.అద్వానీ సన్నిహితుడు సుధీంద్ర కులకర్ణి కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ మరుక్షణమే ఆయనకు రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డులో సభ్యునిగా మంత్రి మమతా బెనర్జీ నియమించారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయితో పాటు.. అద్వానీకి సైతం ప్రధాన సలహాదారుడుగా ఉన్న సుధీంద్ర కులకర్ణి... భాజపాకు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా, బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సలహా బోర్డులో మిగిలిన సభ్యులులాగానే తనకు స్థానం దక్కిందన్నారు.
ఈ కమిటీకి ఫిక్కీ ఛైర్మన్ అమిత్ మిశ్రా అధ్యక్షుడిగా ఉన్నారని కులకర్ణి గుర్తు చేశారు. ఇదిలావుండగా, రైల్వే బడ్జెట్ సమయంలో మమతా బెనర్జీ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు.. రైల్వేను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఈ బోర్డును ఏర్పాటు చేశారు.