దేశ శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించిన ఫోఖ్రాన్-2 అణు పరీక్షలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు పెట్టుకోవద్దని, అలాగే, దీనిపై రాద్ధాంతం చేయాల్సిన పని లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని రామ్‌సర్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 1998లో జరిగిన ఫోఖ్రాన్-2 అణు పరీక్షల సక్సెస్‌పై ఇప్పటికే భారత అణుశాస్త్ర పితామహుడు డాక్టర్ అబ్దుల్ కలాం వివరణ ఇచ్చారని గుర్తు చేశారు.
కొంతమంది శాస్త్రవేత్తల తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని, వీటిని పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఫోఖ్రాన్-2 అణు పరీక్ష పూర్తి విజయవంతం కాలేదని, అందువల్ల అణు పరీక్షల నిరోధక ఒప్పందంపై సంతకం చేయరాదని భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్త కె.సంతానం సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీఆర్‌డీవో తరపున ప్రతినిధిగా వ్యవహరించిన సంతానం మాట్లాడుతూ.. థెర్మోన్యూక్లియర్ లేదా హైడ్రోజన్ బాంబు విస్ఫోటన ప్రభావం అంచనాలను అందుకోలేదని, ఇది దేశ వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు.