భారతీయ జనతా పార్టీలోని సీనియర్ నేతల మధ్య ఏర్పడిన విభేదాలు అగ్రనేతల పదవులకు ఎసరుపెట్టాయి. ఇప్పటికే.. జిన్నాను ప్రస్తుతించిన పార్టీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌పై పార్టీ అకారణంగా బహిష్కరణ వేటు వేసింది. ఇది ఆ పార్టీలో భారీగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలో జరిగిన తప్పొప్పులను జశ్వంత్ సింగ్ ఒక్కోరోజు ఒక్కో విధంగా బాంబు పేల్చుతున్నారు.
ఫలితంగా అగ్రనేత అద్వానీ మనస్సు కలత చెంది... లోక్‌సభలో ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి ఎల్కే.అద్వానీ తప్పుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు సీఎన్ఎన్ఐబీఎన్ ఛానల్ ప్రతినిధికి తెలియజేశాయి. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై అద్వానీ శనివారం మధ్యాహ్నం సమావేశమై విపులంగా చర్చించారు.
ఈ చర్చల్లోనే తన రాజీనామా వ్యవహారాన్ని కూడా భగవత్ వద్ద అద్వానీ ప్రస్తావించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అంతేకాకుండా.. ప్రతిపక్ష నేత నుంచి తాను తప్పుకున్న తర్వాత... ఆ బాధ్యతలను తాను సూచించే వ్యక్తులకే ఇవ్వాలని అద్వానీ షరతు విధించగా, దీనికి భగవత్ హామీ ఇచ్చినట్టు వినికిడి.
మొత్తం మీద భాజపాలో నెలకొన్న అంతర్గత సంక్షోభం అద్వానీ ప్రతపక్ష నేత పదవికి ఎసరు పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.