చైనా మిలిటరీ హెలికాఫ్టర్ ఒకటి భారత గగనతలంలోకి వచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ సోమవారం వెల్లడించారు. జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి రెండు నెలల క్రితం చైనా హెలికాఫ్టర్ ప్రవేశించిందని, ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని దీపక్ కపూర్ తెలిపారు. లెహ్‌లోని వాస్తవాధీన రేఖను దాటి చైనా హెలికాఫ్టర్ భారత్ గగనతలంలోకి వచ్చింది.
చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దీపక్ కపూర్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మీడియాలో భారత గగనతలంలోకి చైనా మిలిటరీ హెలికాఫ్టర్లు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ధృవీకరించారు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లిందన్నారు.
ఇరుదేశాల మిలిటరీ అధికారుల సమావేశంలో మన గగనతలంలోకి హెలికాఫ్టర్ వచ్చిన విషయాన్ని చైనాకు తెలియజేశాము. సాంకేతిక లోపాల కారణంగా ఇది జరిగివుండవచ్చని కపూర్ పేర్కొన్నారు. జులై 21న చైనా హెలికాఫ్టర్ దేశ గగనతలంలోకి వచ్చి వెళ్లింది. లెహ్ సమీపంలోని చుమర్ వద్ద అది ఆహార పదార్థాలను జారివిడిచినట్లు తెలుస్తోంది.