దేశంలోని ఈశాన్య భాగంలో మరోసారి భూకంపం సంభవించింది. గడిచిన మూడు వారాల్లో ఈ ప్రాంతంలో నాలుగోసారి భూకంపం సంభవించింది. తాజాగా సంభవించిన స్వల్ప భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదయింది. శుక్రవారం తెల్లవారుజాముకు ముందు సంభవించిన ఈ భూకంపం కారణంగా స్థానికులు నిద్రలో ఉలిక్కిపడ్డారు.
మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలు, మయన్మార్ సరిహద్దుల్లో భూకంప ప్రభావం కనబడింది. శుక్రవారం 1.21 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అసోం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ప్రజలు ఈ భూకంపం కారణంగా భయకంపితులయ్యారు.
మయన్మార్‌లోనూ ఈ ప్రభావం కనిపించింది. పది సెకన్లపాటు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణభయంతో అర్ధరాత్రి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టంపై ఎటువంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు