దేశంలో ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పూణే నగరంలో తాజాగా మరో మూడు మరణాలు సంభవించాయి. తాజాగా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని పూణే ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో నగరంలో మొత్తం మృతుల సంఖ్య 40కి చేరుకుంది.
శుక్రవారం ఈ వ్యాధి కారణంగా మృతి చెందిన ముగ్గురిని ప్రకాశ్ చవాన్ (48), సీమా శిర్సాత్ (3), అమర్ ఖోల్కోల్కర్ (14)గా గుర్తించారు. ఇదిలా ఉంటే పూణే సమీపంలోని లోనవాలా ప్రాంతంలో పాఠశాలలన్నింటినీ అధికారిక యంత్రాంగం మూసివేసింది.
డాన్ బాస్కో పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికారిక యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మరో 11 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా పది రోజులపాటు పాఠశాలలన్నింటినీ మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక యంత్రాంగం తెలిపింది.