ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి కోర్టు చిక్కులు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన తాజ్ కారిడార్ కేసులో అలహాబాద్ హైకోర్టు మాయావతితో పాటు.. ఆమె మంత్రివర్గ సహచరులకు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుండగా, మాయా సర్కారు చేపట్టిన స్మారక విగ్రహాల స్థాపనపై విధించిన స్టేను సుప్రీంకోర్టు పొడగించింది. ఈ రెండు కేసుల్లో మాయా సర్కారు కోర్టుల నుంచి చీవాట్లు తినడం గమనార్హం.
తాజ్ కారిడార్ కేసులో ప్రొసీడింగ్స్ తిరిగి నమోదు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై అలహాబాద్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు చేసింది. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అనుపమ సింగ్, కమలేష్ వర్మలు పిల్‌ను దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ ప్రదీప్ కాంత్, జస్టిస్ సబేహుల్ హస్నెయిన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఆఖరి విచారణ నవంబరు నెలలో ఉంటుందని కోర్టు వెల్లడించింది. అలాగే విగ్రహాల ఏర్పాటు కేసులో సుప్రీం స్టే పొడగించింది.
లక్నోలో మాయా సర్కారు చేపట్టిన స్మారక విగ్రహాల నిర్మాణాల కేసులో ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.ఎన్.అగర్వాల్, అఫ్తాబ్ అలామ్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
నిర్మాణాల కొనసాగింపుపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ కోర్టు స్టే ఇచ్చింది. కేసు తదుపరి విచారణ అక్టోబర్ ఐదో తేదీన జరుగుతుందని వెల్లడించారు. ఈ కేసులో రాష్ట్ర సర్కారు స్పందన ఈనెల 29వ తేదీలోగా తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.
లక్నోలోని ప్రధాన పార్కుల్లో కాన్షీరామ్, అంబేద్కర్ వంటి నేతల స్మారక విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర బడ్జెట్‌లోని 80 శాతం నిధులను మళ్లించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు గతంలో అభిప్రాయపడింది. దీంతో మాయా సర్కారు సుప్రీం కోర్టుకు క్షమాపణలు కూడా చెప్పింది.
ప్రభుత్వ ఖజానా నుంచి నిధులను ఖర్చు చేయడంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది. 80 శాతం నిధులను కేటాయిస్తూ శాసనసభ తీసుకున్న నిర్ణయం, సమర్థనీయం కాదని ధర్మాసనం పేర్కొన్న విషయం తెల్సిందే.