నక్సలైట్ల ఆచూకీకి డ్రోన్ విమానాలు: కేంద్రం పరిశీలన
శనివారం, 19 సెప్టెంబర్ 2009( 11:47 IST )
దేశ అంతర్గత భద్రతకు పెనుసవాల్ విసురుతున్న నక్సలైట్లు, వామపక్ష తీవ్రవాదాన్ని అణిచి వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని రకాల చర్యలు చేపట్టి, అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన డీజీపీ, ఐజీల సదస్సులో కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, కీకారణ్యాల్లో తిష్టవేసే నక్సలైట్లు, మావోయిస్టుల ఆచూకీని తెలుసుకునేందుకు మానవరహిత విమానాలను ఉపయోగించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. యూరోపియన్ విమానాల సంస్థ 'ఈడ్స్' తయారు చేసిన ఈ రకం విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదన తెచ్చింది.
ప్రధానంగా మావోయిస్టుల జాడ కనుగొనడానికి వీటిని ఉపయోగించాలనేది హోం శాఖ ఆలోచన. తమ ముందు ఉన్న అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని హోం శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
కాగా, "గూఢచారి డ్రోన్"లుగా భావించే యుఏవీ (మానవరహిత విమానాలు)లను తేలికగా ప్రయోగించవచ్చు. ఒక కంప్యూటర్ సాయంతోనే వీటిని నియంత్రించే అవకాశం వుంది. వీటి ద్వారా తేలికపాటి క్షిపణులు, బాంబులను కూడా ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
అంతేకాకుండా, డ్రోన్‌లో అమర్చిన ఆధునిక సమాచార వ్యవస్థ రహస్య సమాచారాన్ని సేకరించడమే కాకుండా, మొబైల్, రేడియో కమ్యూనికేషన్లను సైతం అడ్డుకోగలవు. దట్టమైన అడవుల్లో నక్సలైట్లు, మావోయిస్టుల కదలికను ఇట్టే పసిగట్టగలవు. అందువల్ల వీటిని కొనుగోలు చేసి, వీటి సాయంతో మావోయిస్టుల పని పట్టాలని కేంద్రం భావిస్తోంది.