మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి శివసేన అధినేత బాల్‌థాక్రే దూరంగా ఉండనున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ మొత్తానికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు థాక్రే కుమారుడు, శివసేన నేత ఉద్ధవ్ థాక్రే శనివారం ముంబైలో వెల్లడించారు.
అంతేకాకుండా, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్టు ఆయన తెలిపారు. భాజపా-సేనల మధ్య ఏర్పడిన ఒప్పందం మేరకు శివనేస 169 సీట్లలోనూ, భాజపా 119 సీట్లలో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.
భాజపాకు గత 2004 అసెంబ్లీ ఎన్నికల కంటే రెండు సీట్లను అధికంగా కేటాయించినట్టు గుర్తు చేశారు. ఇదిలావుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-సేన నేతలు ఉమ్మడిగానే ముందుకు సాగనున్నారు. ఇందులోభాగంగా శుక్రవారం ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు.