భవిష్యత్‌లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీఏ కూటమిలోని పార్టీలన్నీ సంయుక్తంగా కలిసి పోటీ చేయాలని కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల మతతత్వ పార్టీలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.
వచ్చే యేడాది జరుగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు లాలూ ప్రసాద్ శనివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వీరిమధ్య సుమారు అర్థగంట పాటు చర్చ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే యేడాది జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో లౌకిక పార్టీలన్నీ ఒక్కటిగా కలిసి పోటీ చేద్దామని సోనియాకు చెప్పానని తెలిపారు.
యూపీఏ కూటమి ఆధ్వర్యంలోని రాష్ట పార్టీలన్నీ సంయుక్తంగా బరిలోకి దిగాలని లాలూ సూచించినట్టు తెలిపారు. దీనిపై సీనియర్లతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తానని సోనియా చెప్పారని తెలిపారు.
కాగా, బీహార్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ-ఎల్జేపీ కూటమి ఎనిమిది చోట్ల, కాంగ్రెస్ మూడింటిలో విజయం సాధించగా, అధికార పార్టీ, ఇతరులు కలిసి ఐదు స్థానాల్లో గెలుపొందిన విషయాన్ని లాలూ గుర్తు చేశారు.