జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జశ్వంత్ బహిష్కరణను కోరుకోలేదు: అద్వానీ (Jaswant`s expulsion | Advani | Jinnah)
 
బీజేపీ నుంచి సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌ను బహిష్కరించాలని తాను కోరుకోలేదని ప్రతిపక్ష నేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. జశ్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఇటీవల బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ జాతిపిత జిన్నాను ప్రశంసిస్తూ పుస్తకం రాసినందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే జశ్వంత్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలనే నిర్ణయాన్ని తాను సమర్థించలేదని, తాను దానిని కోరుకోలేదని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ సోమవారం వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయంలో అద్వానీ కూడా భాగమేనని పార్టీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాను జశ్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఏకీభవించలేదని అద్వానీ తాజాగా తెలిపారు.

ఆగస్టు 19న సిమ్లాలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జశ్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అద్వానీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాను పాల్గొన్నప్పటికీ, బహిష్కరణ నిర్ణయానికి మద్దతుగా నిలువలేదన్నారు. దీనిపై వివరంగా మాట్లాడేందుకు అద్వానీ నిరాకరించారు. దీనిపై మరింత రాద్ధాంతం సృష్టించాలనుకోవడం లేదన్నారు.

ఇదిలా ఉంటే తాజా పరిణామంపై బీజేపీ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. సిమ్లాలో జరిగిన చింతన్ బైఠక్ వివరాలను విలేకరులతో చెప్పారు.

ఆగస్టు 21న జశ్వంత్ సింగ్‌ను బహిష్కరిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం బాధాకరమైనప్పటికీ, అవసరమైన నిర్ణయమని అద్వానీ చెప్పారన్నారు. మానసికంగా ఇది చాలా బాధాకరం. 30 ఏళ్లు తమతో ఉన్న వ్యక్తిని బయటకు పంపడం ఇబ్బందికరమే. అయితే జశ్వంత్ పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుస్తకం రాశారని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.