సీపీఐ (మావోయిస్టు) పొలిట్‌బ్యూరోలోని ఓ సభ్యుడిని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దేశ రాజధానిలో ఓ మావోయిస్టు అగ్రనేతను ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక సెల్ అదుపులోకి తీసుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు నేత కబద్ గాంధీ మావోల ప్రచురణ విభాగానికి నేతృత్వం వహిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లోకి మావోయిస్టు దళాన్ని విస్తరించేందుకు కూడా ఇతను కృషి చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు స్పందించిన ఢిల్లీ పోలీసులు కబద్ గాంధీని అరెస్టు చేశారు. అయితే అతడిని ఎక్కడ అరెస్టు చేశారనే వివరాలు మాత్రం పోలీసులు బయటపెట్టలేదు.
దేశంలో మావోయిస్టు ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు విదేశీ వామపక్ష తీవ్రవాద సంస్థలతోనూ మావోయిస్టు నేతలకు సంబంధాలు ఉన్నాయన్నారు. కబద్ గాంధీ కూడా విదేశీ వామపక్ష తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.