సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ), అణు నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్‌పీటీ)లపై భారత్‌సహా, వీటిపై సంతకం చేయని ఇతర దేశాలు సంతకం చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రకటనపై భారత్ స్పందన భేషుగ్గా ఉందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించింది.
సీటీబీటీ, ఎన్‌పీటీల విషయంలో ప్రభుత్వం స్పందనను బీజేపీ సమర్థించింది. తమ ఆందోళనలను పరిష్కరించే వరకు వీటిపై సంతకం చేయబోమని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి సదస్సు సందర్భంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వ ప్రకటన బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్వాగతించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ భారత్ సీటీబీటీ, ఎన్‌పీటీలపై సంతకం చేయరాదని తమ పార్టీ కోరుకుంటుందన్నారు.
మనకిమనం విధించుకున్న పరిమితులు, మనంతట మనం అణ్వస్త్రాన్ని మొదట ఉపయోగించకుండా ఉండాలనే నిబంధనకు కట్టుబడి ఉంటే సరిపోతుందన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రభుత్వం ఈ విషయంలో తాజాగా చేసిన ప్రకటనను తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తామన్నారు.